ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:23 pm Posted by : Shiva Kumar BS

రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతానికి పోచంపల్లిలో అవగాహన కార్యక్రమం

బీసీల హక్కుల సాధనకు ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలి: నీరజా గౌడ్

ఆదాబ్ సైబరాబాద్, పోచంపల్లి : రానున్న జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పోచంపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్మికులు, ప్రజలను ప్రత్యక్షంగా కలిసి సభ ప్రాధాన్యాన్ని వివరించారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజా గౌడ్ పాల్గొని గ్రామాల్లో పర్యటించారు. కార్మికులు, మహిళలు, సాధారణ ప్రజలను కలుసుకుని బీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యాలతో నిర్వహిస్తున్న ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు.

ఈ సందర్భంగా నీరజా గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరగనున్న రాజ్యాధికార సమరభేరి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

రాజ్యాధికార సమరభేరి సభ బీసీల హక్కుల సాధన దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ సభ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు షాలిని, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్‌తో పాటు స్థానిక నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.