ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:22 pm Posted by : Shiva Kumar BS

స్వామి వివేకానంద పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించాలి: ఆకుల సతీష్

పూర్తికాని స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్

ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : ప్రగతి నగర్‌లోని స్వామి వివేకానంద పార్కును తక్షణమే అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ప్రగతి సెంట్రల్ స్కూల్ సమీపంలోని సర్వే నంబర్లు 178, 179లో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన కోరారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి పార్కులోని వాకింగ్ ట్రాక్‌ను శ్రమదానం ద్వారా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, దాదాపు 90 శాతం పూర్తయిన స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

సహజసిద్ధమైన కొండలు, పెద్ద వృక్షాలతో ఈ పార్కు ప్రగతి నగర్ ప్రాంత ప్రజలకు విలువైన పర్యావరణ సంపదగా నిలుస్తోందని ఆకుల సతీష్ పేర్కొన్నారు. పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

పార్కు అభివృద్ధికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, పి.వి. శ్రీనివాస్, ఎల్ల స్వామి, మురళీకృష్ణ, కృష్ణ, కిషోర్, వెంకట్రావు, రాజిరెడ్డి, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.