ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 10:15 pm Posted by : Shiva Kumar BS

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు

ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : ఈ నెల 20న నిర్వహించనున్న రెండో జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్మన్ ఎం. నాగరాజు కోరారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను అధిక సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేయాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు తక్కువ ఖర్చుతో, త్వరితగతిన పరిష్కారమవుతాయని, తద్వారా కక్షిదారులు సుదీర్ఘ న్యాయపోరాటాల నుంచి ఉపశమనం పొందుతారని తెలిపారు.

ముఖ్యంగా మోటారు ప్రమాద పరిహార కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు తదితర రాజీకి అనుకూలమైన వ్యవహారాలను గుర్తించి లోక్ అదాలత్‌కు పంపించాలని న్యాయవాదులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి బార్ అసోసియేషన్ సభ్యులు చురుకుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతీప్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి-కమ్-కార్యదర్శి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. శాంతిలత, వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. లవకుమార్, కార్యదర్శి పి. వెంకట్ రెడ్డి, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని బార్ అసోసియేషన్ సభ్యులు హామీ ఇచ్చారు.