ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:17 pm Posted by : Shiva Kumar BS

నిజాంపేట్ సర్కిల్‌లో నీటి సమస్య-చర్యలు తీసుకోవాలని జలమండలికి నివాసితుల వినతి

ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్-మల్కాజిగిరి : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని తాగునీటి కొరతను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ స్థానిక నివాసితులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

నిజాంపేట్ సర్కిల్ పరిధిలో సుమారు ఐదు లక్షల జనాభా నివసిస్తోందని, ప్రస్తుతం ప్రగతి నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి సరఫరా పెరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నిజాంపేట్ సర్కిల్ పరిధిలో రోజుకు కేవలం 3 నుంచి 5 కోట్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోందని, ప్రగతి నగర్ ప్రాంతానికి 3-8 ఎంఎల్‌డీ, నిజాంపేట్ ప్రాంతానికి 4-10 ఎంఎల్‌డీ వరకు మాత్రమే నీటి సరఫరా అందుతోందని తెలిపారు. అయితే మొత్తం సర్కిల్‌కు రోజుకు కనీసం 10 ఎంఎల్‌డీలకు పైగా అదనపు నీటి అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌మిషన్ ఆగ్మెంటేషన్ ఆఫ్ వాటర్ పథకం కింద గోదావరి నీటిని ఇతర వనరులతో అనుసంధానం చేసి నిజాంపేట్ సర్కిల్‌కు తగిన నీటి వాటా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

వినతిపత్రంలో పలు సూచనలు, డిమాండ్లు ఉంచారు. వాటిలో ముఖ్యమైనవి:

  • వారానికి ఒకసారి మాత్రమే కాకుండా అవసరానికి అనుగుణంగా కనీస నీటి సరఫరా ప్రమాణాలు అమలు చేయాలి.
  • ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ నిర్వహించాలి.
  • పైప్‌లైన్ లీకేజీలు, నీటి వృథా, సిబ్బంది కొరత వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
  • లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నివాస సముదాయాలకు తగిన నీటి సరఫరా అందేలా చర్యలు చేపట్టాలి.
  • ప్రగతి నగర్ ప్రాంతానికి రోజుకు కనీసం 1 కోటి లీటరు తాగునీటి సరఫరా పెంచాలి.
  • నిజాంపేట్–బాచుపల్లి ప్రాంతాలకు రోజుకు కనీసం 2 కోట్ల లీటర్ల అదనపు నీటి సరఫరా కల్పించాలి.
  • నిజాంపేట్ సర్కిల్ పరిధిలో రోజుకు కనీసం 14 ఎంఎల్‌డీ అదనపు నీటిని కేటాయించాలని కోరారు.
  • శాశ్వత పరిష్కారం కోసం కొత్త పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు.
  • అదనంగా, హైదరాబాద్ మహానగరానికి గోదావరి నీటిని తీసుకొస్తున్న మూడో దశ ప్రాజెక్టు ద్వారా లభించే నీటిలో నిజాంపేట్ సర్కిల్‌కు ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
  • ఈ వినతిపత్రంపై ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు సంతకాలు చేసి అధికారులకు సమర్పించారు. స్థానిక ప్రజల తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.