ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:04 pm Posted by : Shiva Kumar BS

వర్షాకాల ఏర్పాట్లపై జోనల్ కమిషనర్ సమీక్ష

  • చెత్త రహిత కాలనీగా చంద్రగిరి నగర్
  • ప్రజల కృషికి ఘన సత్కారం

ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : గాజులరామారం సర్కిల్ పరిధిలోని చంద్రగిరి నగర్‌లో చెత్త పేరుకుపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ప్రాంతాన్ని కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పి.పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్త రహిత ప్రాంతంగా మార్చి కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషించిన స్థానిక ప్రజలను ఈ సందర్భంగా ఆయన అభినందించి సత్కరించారు.

అనంతరం కైలాష్ హిల్స్, మల్లారెడ్డి ఆస్పత్రి సమీపంలోని నీరు నిలిచే ప్రాంతాలను జోనల్ కమిషనర్ పరిశీలించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ‘హైడ్రా’ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, గాజులరామారం పరిధిలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా అదనపు మోటార్ పంపులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్, డీఈఈ ఇంజినీరింగ్ తో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.