ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 12:57 pm Posted by : Shiva Kumar BS

తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్‌కు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానం

ఆదాబ్ సైబరాబాద్, భువనగిరి, జూన్ 18: జులై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్విరాజ్‌ను పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క నేతృత్వంలోని బృందం కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది.

ఈ సందర్భంగా తెలంగాణలో సామాజిక న్యాయం, బహుజన వర్గాల రాజకీయ సాధికారత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఉద్యమాల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే లక్ష్యంతో రాజ్యాధికార సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు బృందం వివరించింది.

ఈ సందర్భంగా పటేల్ వనజక్క మాట్లాడుతూ, సామాజిక మార్పు కోసం పోరాడుతున్న ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలు, బహుజన శక్తులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ అధికారం కొద్దిమంది చేతుల్లో కాకుండా శ్రమజీవి వర్గాల చేతుల్లోకి వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. బహుజన వర్గాల ఐక్యతతోనే రాజ్యాధికార సాధన సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతోందని, రాజ్యాధికార సమరభేరి సభ ఆ ఉద్యమాన్ని మరింత విస్తరించే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని తెలిపారు.

జులై 5న భువనగిరిలో జరిగే సభకు ప్రజాసంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు, యువత, మహిళలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర నాయకులు గిరగాని బిక్షపతి గౌడ్, అర్కటి పావని, అర్కటి శ్రీనిధి, రాజు తదితరులు పాల్గొన్నారు.