ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 10:09 pm Posted by : Shiva Kumar BS

40తులాల బంగారం చోరీ..12గంటల్లో నింధితుడు అరెస్ట్

దోచుకున్న బంగారు ఆభరణాలు స్వాధీనం

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ జోన్ : బౌరంపేటలోని త్రిపుర ల్యాండ్‌మార్క్-2లో జరిగిన ఇంటి దొంగతనం కేసును దుండిగల్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్టు చేసి 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన చి. లక్ష్మీనారాయణ (36) అనే వ్యక్తి, బాధిత మహిళతో కలిసి గడ్డపోతారం ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సహోద్యోగి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, ఆమె ఇంట్లోని అల్మిరాలో ఆభరణాలను భద్రపరుస్తుందని తెలుసుకున్న నిందితుడు దొంగతనానికి పథకం రచించాడు. ఈ నెల 22న మధ్యాహ్న సమయంలో బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఇంటి తాళాలను చాకచక్యంగా తీసుకున్నాడు. అనంతరం బైక్‌పై త్రిపుర ల్యాండ్‌మార్క్-2లోని ఆమె నివాసానికి వెళ్లి, తాళాలతో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి లోపలికి ప్రవేశించాడు. అల్మిరాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలను అపహరించి, తిరిగి కంపెనీకి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా తాళాలను మళ్లీ బాధితురాలి బ్యాగ్‌లో పెట్టేశాడు. దొంగతనం విషయం వెలుగులోకి రావడంతో దుండిగల్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, కేవలం 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు, అరెస్టు ప్రక్రియను మేడ్చల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చి. శంకర్ రెడ్డి పర్యవేక్షణలో, దుండిగల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి. సతీష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాల్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ దాలి నాయుడు, ఎస్సై శంకర్, ఎస్సైపీ ఎం. రామ్మోహన్ రెడ్డి, క్రైమ్ టీమ్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కేసును చాకచక్యంతో త్వరగా ఛేదించబడటంతో కుత్బుల్లాపూర్ డిసిపి కోటిరెడ్డి పోలీసులను అభినందించారు.