ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 10:13 pm Posted by : Shiva Kumar BS

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-పరిశీలించిన కూకట్‌పల్లి ఈఆర్‌ఓ

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం-46 ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ, కూకట్‌పల్లి జోన్ జోనల్ కమిషనర్ బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, మోతీనగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓస్) కూడా పాల్గొన్నారు. పరిశీలన సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని ఈఆర్‌ఓ సమీక్షించారు. అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ, అభ్యంతరాలు మరియు దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పరిష్కరించే అంశాలపై అధికారులతో చర్చించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించేలా సమగ్రంగా పని చేయాలని ఈఆర్‌ఓ సంబంధిత ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు మరియు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని, ఓటరు నమోదు, వివరాల సవరణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరుగా నమోదు కావాలనుకునే ప్రతి అర్హుడికి అవసరమైన సహాయ సహకారాలు అందించి, ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. లోపరహిత ఓటరు జాబితా రూపకల్పన, ఇంటింటి ధృవీకరణ, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కీలకమని అధికారులు పేర్కొన్నారు.