ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:11 pm Posted by : Shiva Kumar BS

బేకరీపై ఎస్‌వోటీ దాడి..

గడువు ముగిసిన పదార్థాలు, కృత్రిమ రంగులు స్వాధీనం
మేడ్చెల్ : గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించి ఎలాంటి లైసెన్సులు లేకుండా బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న అక్రమ యూనిట్‌పై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడి నిర్వహించింది. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 28న విశ్వసనీయ సమాచారం మేరకు మజీద్‌పూర్‌లోని ఎంసీఆర్ బేకరీపై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. తనిఖీల్లో ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీలో గడువు ముగిసిన ఫ్లేవర్లు, కృత్రిమ ఆహార రంగులను ఉపయోగిస్తున్నట్లు, అలాగే ఉత్పత్తి ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో బోడ ఆనంద్ (38), బోడ సౌజన్య (32) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు మజీద్‌పూర్ క్రాస్ రోడ్‌లో నివాసముంటూ అక్రమంగా బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్‌స్కాచ్ ఫ్లేవర్, పింక్ రోజ్, చాక్లెట్, ఆపిల్ గ్రీన్ ఫ్లేవర్లకు చెందిన మూడు గడువు ముగిసిన సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌వోటీ అధికారులు తెలిపారు.