ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 11:01 pm Posted by : Shiva Kumar BS

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ల తనిఖీలు

విద్యా నాణ్యత, మౌలిక వసతులపై సమీక్ష.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రోత్సాహం

ఆదాబ్ సైబరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పర్యటనలో భాగంగా కలెక్టర్లు విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధిస్తూ, వారితో మమేకమై వారి అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేశారు. అలాగే తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఇతర మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్లు ప్రోత్సహించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన అభ్యాస వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడం, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.