- భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని
- సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే బోనాల మహోత్సవాలను భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కేంద్రం నుంచి గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ తదితర ప్రధాన దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో తొలి 15 రోజులు అత్యంత కీలకమని సీపీ పేర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల ఏర్పాట్లపై ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌తో పాటు స్థానిక పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఆలయాల పరిసరాల్లో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ స్పష్టం చేశారు. గత బోనాల ఉత్సవాల్లో మహిళలను వేధించిన 644 మంది ఆకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి కూడా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబుదొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దేవాలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు శాంతియుతంగా జరిగేలా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్ – సౌత్ రేంజ్) తఫ్షీర్ ఇక్బాల్, డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ ఎస్బీ నర్సింహారావు పాల్గొన్నారు. అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్‌తో పాటు అన్ని జోన్ల లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.