ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:26 pm Posted by : Shiva Kumar BS

డ్రైనేజీ మూతలు లేక ప్రజలకు ప్రాణభయం..

నాసిరకం పనులపై కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆదాబ్ సైబరాబాద్, నిజాంపేట్: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ఆరోపించారు. నాసిరకం రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్
పై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప నుంచి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి వెళ్లే మార్గంలో డ్రైనేజీపై మూతలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ, కోట్ల రూపాయల ప్రజాధనంతో రోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్లు నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుని నాసిరకం పనులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయని అన్నారు.

గతంలో ఎన్ఆర్ఐ కాలనీలో డ్రైనేజీ కాలువలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, అలాంటి విషాదాలు జరిగినా అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్య వైఖరి వీడడం లేదని విమర్శించారు. అలాగే ఇంద్రన్న కాలనీలో కూడా డ్రైనేజీ మూతలు తెరిచి ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఓపెన్ డ్రైనేజీలకు వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్ సదానందంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆశి యాదయ్య, పొన్నకంటి దస్తగిరి, నర్సింగ్, రాజు, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.