ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:20 pm Posted by : Shiva Kumar BS

డంపింగ్ యార్డ్ ఎత్తివేతే శాశ్వత పరిష్కారం

అవగాహన సదస్సులో ప్రభుత్వాలు, రాంకి సంస్థ తీరుపై వక్తల విమర్శలు

ఆదాబ్ సైబరాబాద్ , జవహర్‌నగర్ : డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమా మహేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన డంపింగ్ యార్డ్ ఎత్తివేత అవగాహన సదస్సులో వక్తలు జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో సమస్య రోజురోజుకూ మరింత తీవ్రమవుతోందని ఆరోపించారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల్లో వాయు, నీరు, నేల కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాసకోశ, చర్మ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల జీవించే హక్కును పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

రాంకి సంస్థ డంపింగ్ యార్డ్ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను సమర్థంగా అమలు చేయడంలో విఫలమైందని, శాస్త్రీయ విధానంలో వ్యర్థాల నిర్వహణ జరగకపోవడంతో కాలుష్యం మరింత పెరుగుతోందని వక్తలు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కంటే నిర్వహణకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసి బాధిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాలుష్య ప్రభావిత ప్రజలకు వైద్య సదుపాయాలు, తాగునీరు, పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్త డాక్టర్ కె. బాబు రావు, అరుణోదయ సాంస్కృతిక జాతీయ నాయకురాలు విమలక్క, ప్రొఫెసర్ కాశీం, వజ్రేష్ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ మేయర్ మేకల కావ్య, మల్లెపూల శ్రీకాంత్, శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, కళాకారుడు వెంకట చారి వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు, డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.