ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:32 pm Posted by : Shiva Kumar BS

సేవతో శిఖరాగ్రానికి..డాక్టర్ కీర్తన యాదవ్‌కు జాతీయ గౌరవం

 

భారత వైద్యుల సంఘం జాతీయ సామాజిక సేవా పురస్కారం

అందుకున్న తెలంగాణ యువ వైద్యురాలు

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : వైద్య సేవలను ప్రజాసేవతో మేళవించి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ యువ వైద్యురాలు డాక్టర్ ఎన్. కీర్తన యాదవ్ ప్రతిష్ఠాత్మక భారత వైద్యుల సంఘం (ఐఎంఏ) జాతీయ సామాజిక సేవా పురస్కారం అందుకొని రాష్ట్రానికి అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు. చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పురస్కారాన్ని అందుకోవడం ఆమె సేవలకు లభించిన విశిష్ట గౌరవంగా నిలిచింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది నామినేషన్లను పరిశీలించిన అనంతరం, సామాజిక సేవలో విశేష కృషి చేసిన కేవలం 25 మంది వైద్యులను మాత్రమే ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో వైద్యుడికి మాత్రమే అవకాశం లభించగా, తెలంగాణ నుంచి డాక్టర్ కీర్తన యాదవ్ ఎంపిక కావడం రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచింది.న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. దేశ నలుమూలల నుంచి ఎంపికైన ప్రముఖ వైద్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తన యాదవ్ సేవలను భారత వైద్యుల సంఘం ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రస్తుతం ఉస్మానియా వైద్య కళాశాలలో మత్తుమందు వైద్య విభాగం (అనస్థీషియాలజీ)లో సహాయ ఆచార్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కీర్తన యాదవ్, మరోవైపు డాక్టర్ నారి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకురాలిగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, ప్రాణరక్షణకు ఉపయోగపడే గుండె-శ్వాస పునరుద్ధరణ (సీపీఆర్) శిక్షణ, మహిళల ఆరోగ్య పరిరక్షణ, యువతలో ఆరోగ్య చైతన్యం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య సహాయం వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మందికి చేరువయ్యారు. వైద్య సేవను ఆసుపత్రి గోడలకే పరిమితం చేయకుండా, సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న డాక్టర్ కీర్తన యాదవ్‌కు ఈ జాతీయ పురస్కారం దక్కడం ఆమె సేవలకు దేశస్థాయిలో లభించిన గుర్తింపుగా వైద్య రంగ ప్రముఖులు పేర్కొంటున్నారు.
వైద్య వృత్తిలో నిబద్ధత, సామాజిక సేవలో అంకితభావం, ప్రజల పట్ల బాధ్యత కలిసివస్తే ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో డాక్టర్ కీర్తన యాదవ్ మరోసారి నిరూపించారు. ఆమె సాధించిన ఈ గౌరవం తెలంగాణకే కాకుండా యువ వైద్యులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని వైద్య, సామాజిక వర్గాలు అభినందిస్తున్నాయి.