ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:09 pm Posted by : Shiva Kumar BS

ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌పై ప్రైవేటు పెత్తనం?

వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని అక్రమంగా అద్దెకు ఇస్తున్నారన్న ఆరోపణలు..

ఆరేళ్ల ఆదాయంపై విచారణకు డిమాండ్

కుత్బుల్లాపూర్ : దుండిగల్ సర్కిల్ పరిధిలోని శంభిపూర్ గ్రామం సర్వే నంబర్–181లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతూ స్థానిక గ్రామస్థులు దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, గ్రామ పంచాయతీ హయాంలో ప్రజల ప్రయోజనం కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్, దుండిగల్ మున్సిపాలిటీ ఏర్పాటై అనంతరం జీహెచ్‌ఎంసీలో విలీనమైనప్పటికీ ఇప్పటికీ అధికారికంగా జీహెచ్‌ఎంసీ ఆధీనంలోకి రాలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు కమ్యూనిటీ హాల్‌ను తమ సొంత ఆస్తిలా నిర్వహిస్తూ, వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, ఇతర వేడుకలకు అద్దెకు ఇచ్చి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం మాత్రమే కాకుండా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్‌ను ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే అంశంపై కూడా సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను నిర్ధారించాలని కోరారు.

ఫిర్యాదులో భాగంగా గ్రామస్థులు పలు డిమాండ్లు చేశారు, వాటిలో ప్రధానంగా:

* కమ్యూనిటీ హాల్ యాజమాన్యం, నిర్వహణపై తక్షణ విచారణ చేపట్టడం.
* భవనాన్ని వెంటనే జీహెచ్‌ఎంసీ ఆధీనంలోకి తీసుకోవడం.
* అక్రమంగా అద్దెలు వసూలు చేశారా లేదా అనే అంశాన్ని పరిశీలించడం.
* గత ఆరేళ్ల ఆదాయంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, అక్రమంగా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయించడం.
* బాధ్యులపై జీహెచ్‌ఎంసీ చట్టం–1955తో పాటు ఇతర వర్తించే చట్టాల ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడం.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజా ఆస్తులు ప్రజల ప్రయోజనాలకే వినియోగించబడేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదులో జీహెచ్‌ఎంసీ చట్టంలోని అనధికార ఆక్రమణల తొలగింపు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రస్తావించారు.