ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:46 pm Posted by : Shiva Kumar BS

చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం

రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో పేరుకున్నారు. తాను గత రెండేళ్లుగా హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లుగా అంచనా వేసే ప్రభుత్వ ఆస్తులను రక్షించామని, ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. వందలాది చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు.

భూ మాఫియా, ఆక్రమణదారులు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోతుకుంట భూముల విషయంలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయని, అనుమతులు లేకుండా హెరిటేజ్ రాళ్లను పేల్చివేయడం, వందలాది చెట్లను నరికి పర్యావరణానికి నష్టం కలిగించారని అన్నారు. స్థానికులు, పర్యావరణవేత్తలు, సేవ్ ది రాక్స్ సొసైటీ ఫిర్యాదుల మేరకు హైడ్రా చర్యలు చేపట్టిందని వివరించారు.

తనపై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కార (కంటెంప్ట్) కేసులు ఉన్నాయని, అవన్నీ ప్రభుత్వ భూములు, చెరువులు, సామాన్యుల స్థలాలను కాపాడే క్రమంలో ప్రభావశీల భూకబ్జాదారులు దాఖలు చేసినవేనని పేర్కొన్నారు. ఈ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

గతంలోనూ, ప్రస్తుతం కూడా, భవిష్యత్తులో ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని పూర్తి నిబద్ధతతో నిర్వర్తించి వంద శాతం ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.