ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 11:57 am Posted by : Shiva Kumar BS

భూ కబ్జాదారుల బరితెగింపు.. కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ తొలగింపు

కుత్బుల్లాపూర్ పరిధిలోని పెట్‌బషీరాబాద్ సర్వే నంబర్ 23లో ఉన్న ప్రభుత్వ భూమికి గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ఇటీవల రాత్రికి రాత్రే తొలగించడంపై స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ స్థలానికి గతంలో రెవెన్యూ శాఖ అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే ఆ ఫెన్సింగ్ తొలగించబడిందని, దీంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.

ప్రభుత్వ భూమికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ఎందుకు తొలగించారని, ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్య జరిగిందని, దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోందనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే, ప్రభుత్వ భూముల పరిరక్షణ రాజకీయాలకు అతీతంగా జరగాలని, ప్రజా ఆస్తులను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు.

అదేవిధంగా, ఈ భూమి అంశం గత ప్రభుత్వ హయాంలో కూడా వివాదాస్పదంగా ఉన్నందున, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై తన వైఖరిని ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.