ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:58 pm Posted by : Shiva Kumar BS

80 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు యువకుల అరెస్ట్

శంకర్ పల్లి పోలీసులకు అందిన పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3న గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పైపులైన్ రోడ్డులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా మొత్తం 80 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన ఎం. శ్రీనివాస్ (21), ఎం. శ్రీనివాస్ (26), జే. కిరణ్ (22) ఉన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతం నుంచి కిలోకు సుమారు రూ.6 వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో కిలోకు రూ.20 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తూ అక్రమంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారంతో పోలీసులు గంజాయి రవాణా మార్గాలు, దీనికి సహకరిస్తున్న ఇతర వ్యక్తులు, ముఠా సభ్యుల పాత్రపై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ను ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రుద్వీర్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్ మరియు పోలీసు బృందం విజయవంతంగా నిర్వహించింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని రిమాండ్‌కు తరలించింది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తూ దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.