ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 1:27 pm Posted by : Shiva Kumar BS

ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ – విద్యార్థుల క్యూ.. తెలంగాణలో చారిత్రాత్మక పెరుగుదల

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఫస్ట్ ఇయర్)లో మొత్తం 85,453 మంది విద్యార్థులు చేరగా, గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14 శాతం పెరుగుదల. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,64,730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబిఐబి) కార్యదర్శి అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నాణ్యమైన, సమగ్ర, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యను అందించేందుకు విద్యా సంస్కరణలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థి సంక్షేమ పథకాలు, పరిశ్రమలతో భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

పరిశ్రమలతో భాగస్వామ్యం.. ఉపాధికి కొత్త అవకాశాలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రముఖ సంస్థలైన ఐబిఎం మరియు హెటెరో ఫార్మాస్యూటికల్స్తో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు, పరిశ్రమ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, క్యాంపస్ నియామక అవకాశాలు అందుతున్నాయి. హెటెరో సంస్థ 300 మందికిపైగా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే వివిధ పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా 2,000 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు, అప్రెంటిస్‌షిప్‌లు లభించాయి.

రాష్ట్రస్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం

విద్యా కార్యక్రమాల సమర్థ అమలు, కళాశాలల పరిపాలన బలోపేతం లక్ష్యంగా ఆగస్టు 3న హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాష్ట్రస్థాయి ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సమగ్ర శిక్ష కింద మౌలిక వసతుల అభివృద్ధి, కంప్యూటర్ గదులు, గ్రంథాలయాలు, ఎకో క్లబ్‌లు, వృత్తి విద్య, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందించే సదుపాయాలు, ఆర్థిక నిర్వహణ కోసం ఎస్ఎన్ఏ-స్పర్శ పోర్టల్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. అలాగే పిఓఎస్హెచ్ చట్టం–2013పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల భద్రత, లింగ సమానత్వం, సురక్షిత విద్యా వాతావరణంపై దృష్టి సారించారు.

విద్యా సంస్కరణలు – డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం సిలబస్‌ను
ఎన్సిఈఆర్టి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. పాత అంశాలను తొలగించి ఆధునిక భావనలను చేర్చారు. విద్యార్థులకు క్యూఆర్ కోడ్‌లతో కూడిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చి వీడియోలు, డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్‌ను మొబైల్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు నాయకత్వం, విద్యార్థి కేంద్రిత బోధనపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

రూ.20 కోట్లకు పైగా కంప్యూటర్ గదుల అభివృద్ధి

ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల మౌలిక వసతుల కోసం భారీగా నిధులు విడుదల చేసింది.

40 కళాశాలల్లో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.90 కోట్లు

416 కళాశాలలకు క్రీడా సదుపాయాల కోసం రూ.1.04 కోట్లు

418 కళాశాలల్లో ఎకో క్లబ్‌లకు రూ.10.45 లక్షలు

కంప్యూటర్ గదుల ఏర్పాటు, అభివృద్ధికి రూ.20 కోట్లకు పైగా

కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లకు రూ.2.48 కోట్లు

గ్రంథాలయాల బలోపేతానికి రూ.41.80 లక్షలు

ప్రయోగశాల సామగ్రి, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు రూ.2.34 కోట్లు విడుదల చేశారు.

అదనంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ కళాశాలల వైపు పెరుగుతున్న ఆదరణ

విద్యా నాణ్యత, ఆధునిక బోధన విధానాలు, డిజిటల్ సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నాణ్యమైన, అందుబాటు ధరలో భవిష్యత్‌కు సిద్ధం చేసే విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. రికార్డు స్థాయి అడ్మిషన్లు ఈ మార్పుకు నిదర్శనమని తెలిపారు.