ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:00 pm Posted by : N Sandeep

కొండాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారతావని మువ్వన్నెల జెండా రెపరెపలతో మురిసిపోతోంది: బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్, మసీద్‌బండ చౌరస్తాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో రుధిర ధారలు ఈ నేలను ముద్దాడిన ఫలితంగా, మహాత్ముల త్యాగాలు, వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. అహింసే అసలైన ఆయుధమని మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తుచేశారు.ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని స్వేచ్ఛా వాయువు పీల్చే రోజు స్వాతంత్ర్య దినోత్సవమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు సార్థకత చేకూరేలా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.భారతదేశ గొప్పతనాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.