పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద భరోసాగా నిలుస్తున్నాయని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గురిబాయితో కలిసి బుధవారం నాలుగు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన నాలుగు ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించి ఇంటి యజమానులకు స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున కానుకలను అందజేశారు. అనంతరం చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పేద ప్రజలు సొంతింటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు.ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా శాశ్వత గూడు కల్పిస్తున్నామని, పేదల జీవితాల్లో స్థిరత్వం, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేరిన కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మల్లికార్జున్ గౌడ్, హిరేకర్ రాకేష్, కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజ్, శ్రీకాంత్, రామచందర్ రెడ్డి, గజేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.