e-Paper
Wednesday, September 16, 2026
Homeతెలంగాణఏసీబీ వలలో డీఎస్పీ..ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు

ఏసీబీ వలలో డీఎస్పీ..ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు

📰 Generate e-Paper Clip

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. విధుల్లో ఉన్న సమయంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది.

అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, డీఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, అనుచరులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

సోదాల్లో హైదరాబాద్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విల్లా, టెలికాం నగర్‌లో జీ+2+పెంట్‌హౌస్ భవనం, టెలికాం నగర్, గచ్చిబౌలి, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఫ్లాట్లు, మణికొండలో కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా, వాణిజ్య స్థలం, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో ఓపెన్ ప్లాట్, నాగోల్, పటాన్‌చెరు, మొమిన్‌పేట్ ప్రాంతాల్లో ప్లాట్లు, తెలంగాణ, కర్ణాటకలో విస్తారమైన వ్యవసాయ భూములు, బెంగళూరు దేవనహళ్లిలో భూమి, శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడి తదితర ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అదనంగా డీఎస్పీ నివాసంలో సుమారు రూ.3.60 లక్షల నగదు, బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, దాదాపు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

డీఎస్పీ నివాసంలో 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా లభ్యమవడంతో తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

మరిన్ని ఆస్తులపై పరిశీలన కొనసాగుతోందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.

అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!