టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకుడు తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం హైదరాబాద్ అంబర్‌పేటలోని అలీ కేఫ్ చౌరస్తా సమీపంలోని పద్మావతి డీపీ రెడ్డి హాల్ (కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్)లో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్లు, మాజీ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నేషనల్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, జిల్లా కోర్టులు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిస్థితి, సభ్యత్వ నమోదు, జిల్లా మహాసభల నిర్వహణ, అనంతరం రాష్ట్ర మహాసభలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
టిడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తన్నీరు శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జర్నలిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన తన్నీరు శ్రీనివాస్ జర్నలిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టడం పట్ల ఫెడరేషన్ జిల్లా శాఖలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాస్‌కు సముచిత గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న టిడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్యతో పాటు జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నేషనల్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
