ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ అధికారులు, హైదరాబాద్ రన్నర్స్ ప్రతినిధులు సమన్వయంతో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సంయుక్త సమావేశం, మార్గాల పరిశీలన నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చ. శ్రీనివాస్, సీఎంసీ జోనల్ కమిషనర్లు అమిత్, మయాంక్‌తో పాటు టీజీఐఐసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ రన్నర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న వివిధ మారథాన్ విభాగాల్లో 30 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీగా రన్నర్లు, ప్రేక్షకులు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
ఆగస్టు 30న నిర్వహించే ఫుల్, హాఫ్ మారథాన్‌లు ఉదయం 4.30 గంటలకు పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ముగుస్తాయి. అదే రోజు 10కే రన్ ఉదయం 7.30 గంటలకు హైటెక్ సిటీ వద్ద ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.
మారథాన్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, దశలవారీగా రహదారులను తిరిగి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావడం, రన్నర్ల భద్రత, పార్కింగ్, షటిల్ బస్సుల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, అవసరమైన చోట్ల బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫ్లైఓవర్లు, రద్దీ ప్రాంతాలు, మారథాన్ మార్గంలోని కీలక ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ పటిష్టంగా చేపట్టాలని నిర్ణయించారు. రన్నర్లు నిర్ణీత మార్గంలోనే పరుగెత్తేలా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు.
మారథాన్ సందర్భంగా వాహనదారులు పోలీసుల సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు.

