పేదల భూములకు పూర్తి రక్షణ.. అన్యాయం జరగనివ్వం
15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి తలెత్తిన సమస్యలను ప్రభుత్వం గుర్తించి, తప్పులను సరిదిద్దే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత 24 గంటల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 కలిపి మొత్తం 34 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. 22ఏ నిషేధిత జాబితాలో తమ భూములు చేరాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
“ఇది పేదల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయదు. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదు. వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పించడం మా బాధ్యత” అని మంత్రి పేర్కొన్నారు.
ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపాలు
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నాయని మంత్రి వివరించారు. ఈ తప్పులను ప్రభుత్వం గుర్తించి యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందన్నారు.
గత ప్రభుత్వాల కాలంలో వివిధ జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన ప్రైవేట్ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు సైతం ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చినట్లు తెలిపారు.
సమస్యను గుర్తించిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, బాధితులకు ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని చెప్పారు.
15 రోజుల పాటు ప్రత్యేక పరిశీలన
22ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు పొంగులేటి తెలిపారు.
ఈ కమిటీ రాబోయే 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తులను పరిశీలిస్తుందని చెప్పారు. అర్హత కలిగిన, నిజమైన ప్రైవేట్ ఆస్తులను వేగంగా 22ఏ జాబితా నుంచి తొలగించి క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తప్పును అంగీకరించి సరిదిద్దుతున్నాం
బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా జరిగిన పొరపాటును పారదర్శకంగా అంగీకరించడమే కాకుండా, దాన్ని సరిదిద్దే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.
“తప్పు జరిగితే అధికారులపైకి నెట్టి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే జరిగిన పొరపాటును అంగీకరించాం. అదే సమయంలో దాన్ని సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం. ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం మాది కాదు” అని అన్నారు.
రాజకీయాలకు వాడుకోవద్దు
22ఏ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి ప్రతిపక్షాలకు సూచించారు. పేదల సమస్యను రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం మానుకోవాలని అన్నారు.
“ఇప్పుడు పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయండి. ఇది పేదల ప్రభుత్వం.. పేదల ఆశీస్సులతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వం. మేం తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం.. మీరు చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం మీకుందా?” అని ప్రశ్నించారు.
అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని మంత్రి అన్నారు. సామాన్య ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
