e-Paper
Saturday, September 12, 2026
Homeజాతియంసైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులను పోలీస్ శాఖ తరఫున సన్మానించారు.

పదవీ విరమణ పొందిన వారిలో కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎం. రవీందర్ రెడ్డి, సైబరాబాద్ ఎస్‌బీకి చెందిన ఎస్‌ఐ పి. విజయ్ భాస్కర్ రెడ్డి, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ ఫరీద్ ఖాన్, అత్తాపూర్‌కు చెందిన ఏఎస్‌ఐ టి. కేశవులు, బాలానగర్ ట్రాఫిక్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఏబీ శర్మ ఉన్నారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందడం వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. విధి నిర్వహణలో వారు అందించిన సేవలు, సొంతం చేసుకున్న అనుభవం పోలీస్ శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో సహధర్మచారులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.

పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడుపుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని సీపీ సూచించారు. ఖాళీగా ఉండకుండా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తమ వంతు సేవ అందించాలని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించిందని, ఆ అభివృద్ధిలో భాగస్వాములైన పోలీస్ అధికారులు గర్వపడాలని అన్నారు.

ప్రభుత్వం నుంచి లభించే రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఆర్థిక మొత్తాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సీపీ సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో పదవీ విరమణ పొందిన అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. పోలీస్ శాఖకు అవసరమైన సందర్భాల్లో తమ అనుభవం, సూచనలతో సహకరించాలని పదవీ విరమణ పొందిన అధికారులను కోరారు.

అనంతరం పదవీ విరమణ పొందిన ఐదుగురు అధికారులను సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఘనంగా సన్మానించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి అన్నపూర్ణ, ఎస్‌బీ డీసీపీ సుధీంద్ర, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!