e-Paper
Saturday, September 12, 2026
Homeజాతియంబిర్యానీ పాత్రలో శరీర భాగాలు? 350 సీసీటీవీలతో వీడిన మిస్టరీ

బిర్యానీ పాత్రలో శరీర భాగాలు? 350 సీసీటీవీలతో వీడిన మిస్టరీ

📰 Generate e-Paper Clip

 

చెన్నైలో మహిళను హత్య చేసి ముక్కలుగా నరికిన దంపతులు.. ఆనవాళ్లు చెరిపేందుకు దారుణ యత్నం, తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో గుర్తుతెలియని మహిళ శరీర భాగాలతో కూడిన సూట్‌కేస్‌ కలకలం రేపిన ఘటనలో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చెన్నైలో ఓ మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొంత భాగాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో సుమారు 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 5న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ బోగీలోని ఎరుపు రంగు సూట్‌కేస్‌ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా నరికిన మానవ శరీర భాగాలు కనిపించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చెన్నై నుంచి సూట్‌కేస్‌ తరలింపు

సూట్‌కేస్‌ను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోనే రైలులో ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు చెన్నై సెంట్రల్, పరిసర ప్రాంతాల్లోని సుమారు 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఫుటేజీల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఎరుపు రంగు సూట్‌కేస్‌తో స్టేషన్‌లోకి వచ్చి దానిని రైలులో ఉంచినట్లు గుర్తించారు. అనంతరం వారు చెన్నై పార్క్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి లోకల్ రైలులో గూడువాంచేరి వైపు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు.

ఆటో ఆధారంగా ఇంటికి చేరుకున్న పోలీసులు

గూడువాంచేరి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులు ప్రయాణించిన ఆటోను గుర్తించారు. ఆ ఆటో వెళ్లిన మార్గాన్ని అనుసరిస్తూ మసీదు వీధిలోని ఓ అద్దె ఇంటికి చేరుకున్నారు.

ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రక్తపు మరకలు, హత్య జరిగినట్లు అనుమానించేందుకు బలమైన ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలను సూట్‌కేస్‌లో తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

బిర్యానీ పాత్రలో శరీర భాగాలు?

పోలీసుల దర్యాప్తులో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించిన ఆనవాళ్లను చెరిపివేసేందుకు మృతదేహంలోని కొన్ని భాగాలను మైదా పిండి, కూరగాయలతో కలిపి పెద్ద పాత్రలో ఉడికించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మృతురాలి తల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

మృతురాలు ఒడిశాకు చెందిన నిషాగా గుర్తింపు

మృతురాలిని ఒడిశాకు చెందిన హయత్ నిషాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. భర్తతో విడిపోయిన ఆమె తాంబరంలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆమె కుమారుడు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిషా, మాణిక్ ఉత్తిన్–లస్కర్ దంపతులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. మాణిక్ ఉత్తిన్ తనకు తమ్ముడిగా నిషా చుట్టుపక్కల వారికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది.

హత్యకు కారణమేంటి?

నిషాను ఎందుకు హత్య చేశారు? హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? డబ్బు, నగల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల విచారణతో హత్యకు అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!