వలస కార్మికులకు వసతులు, స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్: వికారాబాద్ మండలం సిద్దులూరు గ్రామంలో ఆర్క ఇన్ఫ్రా డెవలప్మెంట్ వెంచర్స్ చేపడుతున్న పనుల్లో పలు అక్రమాలు, కార్మిక సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు అధికారులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్, రైతు సంఘం జిల్లా నాయకులు, కెవీపీఎస్ ప్రతినిధులు వెంచర్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ, వెంచర్ యాజమాన్యం ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా, రైతులు తమ పొలాలకు వెళ్లే ప్రధాన దారిని మూసివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ, దారి మూసివేత అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంచర్లో పనిచేస్తున్న ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కనీస వసతి సౌకర్యాలు కూడా లేవని, అక్కడ బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. బాల కార్మికులను వెంటనే పాఠశాలలకు పంపించి, వారికి విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు.

అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్థానిక ట్రాక్టర్లు, జేసీబీలకు పనులు ఇవ్వాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న అరకొర కూలీలకు బదులుగా కనీసం రోజుకు రూ.1,000 వేతనం చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్, కెవీపీఎస్ నాయకులు పరమేష్, మధు, నవీన్, రైతులు గోపాల్, నర్సింలు, మహేందర్, అనిల్ గౌడ్, ఎండీ గౌస్ పాషా, పాషా, ప్రసాద్, వెంకట్, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


