- హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన కార్యక్రమం
- చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న 1,600 మంది క్రీడాకారులు
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్
- విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేత
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో, అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐపిఎస్సిబి) సహకారంతో నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్–2026 గురువారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది.
ముగింపు కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 36 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని తెలిపారు. క్రీడలు జాతీయ సమైక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో మరిన్ని అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలను తెలంగాణ పోలీస్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పాయింట్ల పట్టికలో శశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) 24 స్వర్ణ, 20 రజత, 23 కాంస్య పతకాలతో మొత్తం 203 పాయింట్లు సాధించి చాంపియన్‌గా నిలిచింది. సీఐఎస్‌ఎఫ్ 198 పాయింట్లతో రన్నరప్‌గా, ఐటిబీపీ 139 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
జూలై 23 నుంచి 30 వరకు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో 1,600 మంది క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. ఐదు విభాగాల్లో మొత్తం 470 పతకాలు ప్రదానం చేయగా, 36 సంస్థల్లో 28 సంస్థలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి.
ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ, దేశ రక్షణలో ముందుండే పోలీసు బలగాలు అంతర్జాతీయ క్రీడల్లోనూ భారత్‌కు పతకాలు సాధించే సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 2029లో అహ్మదాబాద్‌లో జరగనున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ఆతిథ్యం భారత్‌కు దక్కడం గర్వకారణమని అధికారులు తెలిపారు.

