నవంబర్ 28న ప్రవేశ పరీక్ష – గ్రామీణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉచిత విద్యా అవకాశం
ఆదాబ్ సైబరాబాద్, కీసర : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువు జూలై 31, 2026 వరకు ఉందని ప్రధానాచార్యులు కె. మాధవరావు తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ప్రవేశాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదని స్పష్టం చేశారు. మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉండగా, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు.ప్రవేశ పరీక్షను నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత నాణ్యమైన విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించబడతాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానాచార్యులు కె. మాధవరావు తల్లిదండ్రులు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
