- మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని అందిస్తుంది: డాక్టర్ శ్రీభూషణ్ రాజు
- ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా
- పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘వార్త’ మీడియా వర్క్‌షాప్
హైదరాబాద్ : అవయవదానం ఒక మహోన్నతమైన సేవ అని, మరణించిన వ్యక్తి మరొకరికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, జీవందాన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు అన్నారు.
ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘వార్త’ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. ‘అవయవదానంపై అపోహలు–వాస్తవాలు’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీభూషణ్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్, ఐఐఎస్ డాక్టర్ మనస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశంలో అవయవ మార్పిడి కోసం ఉన్న డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న అవయవాలకు మధ్య గణనీయమైన అంతరం ఉందన్నారు. అవయవదానం, మార్పిడి ప్రక్రియలను సమన్వయం చేయడంలో నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్, స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, వైద్యపరమైన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో ‘వార్త’ వంటి మీడియా వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
డాక్టర్ శ్రీభూషణ్ రాజు మాట్లాడుతూ వైద్య శాస్త్రంలో అవయవ మార్పిడి రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మానవ అవయవాలను పూర్తిస్థాయిలో కృత్రిమంగా తయారు చేసే పరిస్థితి ఇంకా రాలేదన్నారు. అందువల్ల అవయవదాతలు, వారి కుటుంబాల ఔదార్యం ఎంతో విలువైనదని చెప్పారు.
మార్పిడి చేసిన అవయవాన్ని శరీరం సహజంగానే పరాయి పదార్థంగా గుర్తించి తిరస్కరించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అవయవ తిరస్కరణను నివారించేందుకు వైద్య శాస్త్రంలో అభివృద్ధి చెందిన మందులు, చికిత్సా విధానాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అయితే అవయవ తిరస్కరణను అడ్డుకోవడంతో పాటు రోగికి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం వైద్యులకు సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
“అవయవ మార్పిడి విజయవంతం కావాలంటే ముందుగా అవయవాలు అందుబాటులో ఉండాలి. అవయవాలను ఫ్యాక్టరీలో తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు కొత్త జీవితాన్ని అందించడంలో అవయవదానం అత్యంత కీలకం” అని భూషణ్ రాజు అన్నారు.
భారతదేశంలో అవయవదానం, అవయవ మార్పిడిని నియంత్రించడంతో పాటు బలోపేతం చేయడంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్, సంస్థలు కీలకమైన వ్యవస్థను అందిస్తున్నాయని వివరించారు. అవయవదానంపై అవగాహన కల్పించడం, పారదర్శకమైన అవయవ కేటాయింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు.
అవయవదానం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు పెరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వైద్య, శాస్త్రీయ అంశంగానే కాకుండా ప్రస్తుతం అవయవదానం సామాజిక అంశంగా కూడా మారిందన్నారు. ఆర్థిక, కుటుంబపరమైన అంశాలు కూడా అవయవాల డిమాండ్–సప్లై అంతరంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
కుటుంబంలో అవయవదానంపై ముందుగానే చర్చించడం ద్వారా ప్రజల్లో అవగాహన, అంగీకారం పెరుగుతుందని చెప్పారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించడంలో మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉందని డాక్టర్ భూషణ్ రాజు పేర్కొన్నారు.
కుటుంబంలో అవయవదానం చేయాలనుకునే దాత వైద్యపరంగా అనుకూలంగా లేని సందర్భాల్లో స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయమని ఆయన వివరించారు. చట్టపరమైన, వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా అనుకూలమైన దాత–గ్రహీత జంటలను గుర్తించి మార్పిడి చేయవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా అవయవదానంపై మరింత ప్రజా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, సమాజాల్లో విస్తృత చర్చలు జరగాలని వర్క్‌షాప్ పిలుపునిచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని అవయవదానానికి సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులతో చర్చించారు.
‘జుగ్ జుగ్ జియో’ ఉద్యమం
అవయవదానం, అవయవ మార్పిడి కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. 16వ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ ‘జుగ్ జుగ్ జియో (అంగదాన్ కరో, జుగ్ జుగ్ జియో)’ ఉద్యమాన్ని ప్రారంభించింది.
కుటుంబ సభ్యుల మధ్య అవయవదానంపై చర్చలు, స్వచ్ఛంద అవయవదాన ప్రతిజ్ఞలను ప్రోత్సహించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యంగా ఉంది. దేశవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచడంతో పాటు మార్పిడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఉద్దేశం.
అవయవదానానికి సంబంధించిన సమాచారం, సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-11-477ను కూడా అందుబాటులో ఉంచారు.

