ఎల్లమ్మబండ జయశంకర్ కాలనీలో ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాల ఆరోపణలు
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ జయశంకర్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ నంబర్లు 183, 186కు సంబంధించిన JNNURM కేటాయించిన ఇళ్లకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వారు పేర్కొంటున్నారు.ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు స్థానిక నాయకుల అండదండలతో కబ్జాదారులు మరింత ధైర్యంగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు అక్రమ నిర్మాణాలను వెంటనే పరిశీలించి, కబ్జా నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
