గచ్చిబౌలి పోలీస్, ఎస్ఓటీ సైబరాబాద్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.16.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో 16 మంది వినియోగదారులను కూడా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ సైబరాబాద్ బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. కేసు నంబర్ 1431/2026, ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని 27(B), 8(C), 22(C) సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 11న వట్టినాగులపల్లి కింగ్డమ్ పబ్ రోడ్డులో కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్ (26)ను 16 మంది వినియోగదారులతో కలిసి అరెస్ట్ చేశారు. విచారణలో అతడు కేరళకు చెందిన ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించాడు.
దీంతో ప్రత్యేక బృందాలను కేరళ, బెంగళూరుకు పంపిన పోలీసులు.. ఆగస్టు 18న కేరళలోని త్రిసూర్‌లో ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్ (26)ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు యశ్వంత్‌కు 44.41 గ్రాముల ఎండీఎంఏ ఇచ్చినట్లు, ఆ డ్రగ్‌ను సామ్ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి సేకరించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
అదే రోజు కర్ణాటకలోని బెగూర్‌లో నవీనా కేడీ (22)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా 51 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ లభించాయి. ఈ డ్రగ్స్‌ను తన స్నేహితుడు కేరళకు చెందిన అనేశ్వర్ నుంచి తీసుకున్నట్లు విచారణలో నవీనా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో 95.41 గ్రాముల ఎండీఎంఏ విలువ రూ.11,40,920, 50 గ్రాముల ఓజీ కుష్ విలువ రూ.5 లక్షలుగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం రూ.16,40,920 విలువైన డ్రగ్స్‌తో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ సేరిలింగంపల్లి జోన్ డీసీపీ చె. శ్రీనివాస్, ఎస్ఓటీ సైబరాబాద్ డీసీపీ శోభన్‌కుమార్, అదనపు డీసీపీలు టి. గోవర్ధన్, ఉదయ్ రెడ్డి, నార్సింగి ఏసీపీ జి. వెంకట రమణ గౌడ్ పర్యవేక్షణలో ఎస్ఓటీ బృందాలు, గచ్చిబౌలి ఎస్హెచ్ఓ, డీఐ, పోలీసు సిబ్బంది కలిసి నిర్వహించారు.
డ్రగ్స్‌పై పోలీసులకు సమాచారం ఇవ్వండి
డ్రగ్స్, గంజాయి సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 8712663061కు సమాచారం అందించాలని కోరారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రగ్స్ లేదా గంజాయి వినియోగం, సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

