e-Paper
Friday, September 18, 2026
Homeక్రైమ్ న్యూస్సైబరాబాద్‌ పోలీసుల ఘనత..1,218 మొబైల్‌ ఫోన్లు రికవరీ

సైబరాబాద్‌ పోలీసుల ఘనత..1,218 మొబైల్‌ ఫోన్లు రికవరీ

📰 Generate e-Paper Clip

సైబరాబాద్‌: పోయిన, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో సైబరాబాద్‌ పోలీసులు మరోసారి సత్తా చాటారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఆదేశాల మేరకు CEIR పోర్టల్‌ ద్వారా 11వ విడతలో మొత్తం 1,218 మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.2,43,60,000గా పోలీసులు వెల్లడించారు. కూకట్‌పల్లి సీసీఎస్‌ పరిధిలో 410 ఫోన్లు, శేరిలింగంపల్లి సీసీఎస్‌ పరిధిలో 407, కుత్బుల్లాపూర్‌ సీసీఎస్‌ పరిధిలో 401 ఫోన్లు రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లను సంబంధిత బాధితులకు పోలీసులు అందజేశారు. చాలాకాలం క్రితం పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి చేతికి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

CEIRతో ఫోన్ల రికవరీ

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పోర్టల్‌ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేస్తున్నామని సీపీ డాక్టర్‌ ఎం. రమేష్‌ తెలిపారు. ఫోన్‌ పోయిన వెంటనే ప్రజలు CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

మొబైల్‌ ఫోన్‌ ప్రస్తుతం ప్రతి ఒక్కరి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో కీలకంగా మారిందని, పోయిన ఫోన్లను తిరిగి యజమానులకు అందించడం ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ బృందాలు, పోలీసు అధికారులను సీపీ అభినందించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ముఖ్యంగా జాబ్‌ ఫ్రాడ్స్‌, బెట్టింగ్‌ యాప్‌లు వంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, మొబైల్‌ నంబర్లు ఇవ్వకూడదన్నారు.

మార్కెట్లు, బస్‌స్టాపులు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్లు, ఇతర విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఆ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయకూడదని తెలిపారు.

ఫోన్‌ దొరకడంతో బాధితుల ఆనందం

కేపీహెచ్‌బీలో ఫోన్‌ పోగొట్టుకున్న సృజన మాట్లాడుతూ.. టి-పాయింట్‌ వద్ద టీ తాగేందుకు వెళ్లిన సమయంలో తన ఐఫోన్‌ 17 ప్రో మర్చిపోయానని తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో తిరిగి దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందానన్నారు. అయితే పోలీసులు ఫోన్‌ను రికవరీ చేసి తిరిగి అందించడంతో కృతజ్ఞతలు తెలిపారు.

టీ‌సీఎస్‌లో పనిచేస్తున్న నారాయణ చౌదరి తన మోటరోలా ఫోన్‌ కోకాపేటలోని ఓ రెస్టారెంట్‌లో పోయిందని తెలిపారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చాలాకాలం కావడంతో ఫోన్‌ దొరకదని భావించానన్నారు. పోలీసులు ఫోన్‌ రికవరీ అయినట్లు చెప్పడంతో ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు.

మెదక్‌కు చెందిన మహమ్మద్‌ ముఖిబ్‌ కూకట్‌పల్లిలో జొమాటో, స్విగ్గీలో పనిచేసే సమయంలో అల్సబా హోటల్‌ వద్ద తన ఫోన్‌ మర్చిపోయానని తెలిపారు. ఫోన్‌లో బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉండటంతో ఆందోళన చెందానన్నారు. పోలీసులు ఫోన్‌ను రికవరీ చేసి అందించడంతో సంతోషం వ్యక్తం చేశారు.

సత్త్వ నాలెడ్జ్‌ సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన మరో వ్యక్తి తన ఫోన్‌ చోరీకి గురైందని తెలిపారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సీసీఎస్‌ పోలీసులు ఫోన్‌ను రికవరీ చేసి అందించారని, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్రైమ్స్‌ డీసీపీ ఎ. ముత్యం రెడ్డి, క్రైమ్స్‌ ఏసీపీలు వై. నాగేశ్వర్‌రావు, ఎస్. వెంకటేష్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు పి. జగదీశ్వర్‌, జి. సత్యనారాయణ, ఎస్. విజయ్‌, జి. మురళీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!