e-Paper
Thursday, September 17, 2026
Homeజాతియంతెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరిన సీఎం..పనిచేద్దామని విజ్ఞప్తి

తెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరిన సీఎం..పనిచేద్దామని విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. విద్య, పర్యాటకం, వైద్య రంగాలతో పాటు వారసత్వ సంపద పరిరక్షణలో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనం, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పునరుద్ధరణ చేపట్టిన విషయాన్ని వివరించారు.

మూసీ పునరుజ్జీవనంలో సహకారం కోరిన సీఎం

హైదరాబాద్‌ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికలను సీఎం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్‌ ఎకానమీ కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక సిటీ కాలేజ్‌, ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని కోరారు.

గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఆహ్వానం

డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను సీఎం ఆహ్వానించారు. ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V ఆసక్తి చూపగా.. 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 20 నిమిషాల దూరంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని పూర్తిగా నెట్‌-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. సుమారు 15 వేల ఎకరాలను గ్రీన్‌ జోన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

విద్యారంగంలోనూ భాగస్వామ్యం

ఇటీవల బ్రిటన్‌, అమెరికా పర్యటనల్లో ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితా రాణా కోరారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే అందిస్తున్న సహకారాన్ని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వాణీ ప్రసాద్ ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో మరింత భాగస్వామ్యం అందించాలని కోరారు.

సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!