e-Paper
Thursday, July 30, 2026
HomeGHMCజర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే స్వతంత్ర వేదికే టీడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే స్వతంత్ర వేదికే టీడబ్ల్యూజేఎఫ్

📰 Generate e-Paper Clip

టీడబ్ల్యూజేఎఫ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు:
మామిడి సోమయ్య

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పై కొందరు వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆరోపించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ బలంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే 22 జిల్లాల్లో జిల్లా మహాసభలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సభ్యత్వ వివరాలతో కార్మిక శాఖకు వార్షిక నివేదికలను సమర్పించామని, మిగిలిన జిల్లాల మహాసభలు, రాష్ట్ర మహాసభలను కూడా త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంఘానికి సంబంధించిన కొన్ని కోర్టు కేసులు, జర్నలిస్టుల అక్రెడిటేషన్ అంశాలపై న్యాయపరమైన పోరాటాల కారణంగా రాష్ట్ర మహాసభల నిర్వహణలో ఆలస్యం జరిగిందని ఆయన వివరించారు. దీనిని సంఘం బలహీనతగా చిత్రీకరించడం సరికాదన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ తమదేనని, కార్మిక శాఖ గుర్తింపు తమకే వచ్చిందని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సోమయ్య పేర్కొన్నారు. నిజంగా గుర్తింపు పొందినట్లయితే సంబంధిత పత్రాలను బహిరంగపరచేవారని, అలాంటిదేమీ జరగకపోవడం వారి ప్రచారంలో వాస్తవం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

సంఘ బైలాకు విరుద్ధంగా తనను బహిష్కరించినట్లు ప్రకటించడం, బైలాలో లేని “యాక్టింగ్ ప్రెసిడెంట్” పదవిని సృష్టించడం వంటి చర్యలతో కొందరు సంఘాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ పేరును దుర్వినియోగం చేయకుండా, సంఘ బ్యాంకు ఖాతాలను ఇతరులు వినియోగించకుండా సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే అక్రెడిటేషన్ కమిటీల్లో జరిగిన అన్యాయంపై హైకోర్టులో మూడు కేసులు దాఖలు చేసినట్లు వెల్లడించారు. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న సమయంలో తమపై బహిష్కరణ ప్రచారం చేయడం న్యాయవ్యవస్థను కించపరచడమేనని పేర్కొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, మీడియా సంస్థకు లేదా యాజమాన్యానికి అనుబంధంగా పనిచేయదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, గౌరవం కోసం స్వతంత్ర ట్రేడ్ యూనియన్‌గా పనిచేస్తోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిడబ్ల్యూజేయూ) ఏర్పాటైందని, అదే తర్వాత టీడబ్ల్యూజేఎఫ్‌గా రూపాంతరం చెందిందని సోమయ్య వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులను ఏకం చేస్తూ సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాని కొందరు వ్యక్తులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంఘంలో చేరి పదవులు పొందారని, అనంతరం సంఘాన్ని రాజకీయ లేదా మీడియా అనుబంధ సంస్థగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సంఘ స్వతంత్రతను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతోందన్నారు.

ఎన్ని అవాస్తవ ప్రచారాలు జరిగినా ధర్మం, న్యాయం, చట్టం తమ వైపే ఉన్నాయని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మామిడి సోమయ్య పేర్కొన్నారు. జర్నలిస్టులు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా సంఘ ఐక్యతను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!