స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించాలి: డాక్టర్ పి.వి.వి. ప్రసాద్
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ్‌నగర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.వి.వి. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేసిన రక్తదాతలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తం మానవ శరీరానికి ఇంధనం వంటిదని పేర్కొన్నారు. స్వచ్ఛంద రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింత మందిని రక్తదానానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తుందని, ఈ ఏడాది “మానవత్వపు ఒక చుక్క రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి” అనే నినాదాన్ని ప్రకటించినట్లు తెలిపారు. రక్తదానం ద్వారా ప్రమాదాల్లో గాయపడినవారు, తలసీమియా బాధితులు, ప్రసవ సమయంలో గర్భిణులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ప్రాణాలు నిలబెట్టుకుంటారని చెప్పారు.
దేశ జనాభాలో రక్తదానానికి అర్హులైన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులు రక్తదానం చేయవచ్చని, రక్తదానం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని వివరించారు.
ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ ల్యాండ్‌స్టీనర్ సేవలను స్మరించుకున్నారు. మానవ రక్తంలోని రక్తగ్రూపులను కనుగొన్న ఆయన జన్మదినమైన జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం పాల్గొన్న వారితో స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో విశిష్ట అతిథి డీవీఎన్ రాజుతో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జి.వి. రావు, అమ్మయ్య చౌదరి, బాలన్న, శ్రీనివాసులు, మంగళంపల్లి మూర్తి, శ్రీనివాస్, కుర్రా మహేష్, బోయిన మహేష్ యాదవ్, శ్రీ చందన, ఉమా చంద్రశేఖర్, బాలాజీ, విష్ణుప్రసాద్, జిల్ మల్లేష్, రామారావు, బసవరాజు, చప్పిడి కృష్ణ, ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.
