సీఎస్‌ఆర్ సహకారంతో సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు
ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పాఠశాల ఆస్తులను పరిరక్షించేందుకు జీడిమెట్ల ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్రిజ్లోనా కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా ఐదు ప్రభుత్వ పాఠశాలలకు భద్రతా సౌకర్యాలను అందించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున మొత్తం 10 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించారు. వీరు పాఠశాల ఆస్తుల సంరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టనున్నారు.
అదేవిధంగా పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు జీడిమెట్ల పోలీస్ శాఖ సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సేకరించిన 10 సీసీ కెమెరాలను పాఠశాల యాజమాన్యాలకు అందజేసి భద్రతా పర్యవేక్షణను మెరుగుపరిచారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి (ఎంఈఓ) జెమినీ కుమార్, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫ్రిజ్లోనా కంపెనీ ప్రతినిధులను శాలువాలతో సన్మానించి అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, పోలీసుల మధ్య సన్నిహిత సంబంధాలు పెంపొందించడంతో పాటు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, ఎస్సై ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, జీడిమెట్ల పోలీసు సిబ్బంది, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలకు భద్రతా సౌకర్యాల కల్పన కొనసాగిస్తామని ఫ్రిజ్లోనా కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా ప్రకటించింది.
