వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని శనివారం రాత్రి ఏడుస్తూ దౌల్తాబాద్ చెరువు వైపు వెళ్తుండగా, బ్లూకోల్ట్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీస్ కానిస్టేబుల్ రాఘవేందర్ ఆమెను గమనించారు. ఆమె చెరువులో దూకేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్పందించి, ఆమెను అడ్డుకుని కాపాడారు. అనంతరం ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా తీసుకెళ్లారు.

పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ స్నేహ మెహ్రా
సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది అయిన పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీస్ కానిస్టేబుల్ రాఘవేందర్ లను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అభినందించారు. ఆపదలో ఉన్న వారికి మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేయడం పోలీసుల బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.
