e-Paper
Tuesday, November 3, 2026
Homeక్రైమ్ న్యూస్ట్రామడాల్ టాబ్లెట్ల అక్రమ విక్రయాల గుట్టురట్టు..సురారంలో నలుగురు అరెస్ట్

ట్రామడాల్ టాబ్లెట్ల అక్రమ విక్రయాల గుట్టురట్టు..సురారంలో నలుగురు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు మందుల అక్రమ విక్రయాలు, వినియోగంపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు సురారం ప్రాంతంలోని శ్రీ బాలాజీ మెడికల్ షాప్‌పై దాడి నిర్వహించి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

పోలీసులు మెడికల్ షాప్ యజమానితో పాటు ట్రామడాల్‌కు బానిసైన ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.27 వేల విలువైన ట్రామడాల్, టాపెంటడాల్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాటిలో 150 టాపెంటడాల్ 100 ఎంజీ టాబ్లెట్లు, 60 అల్ట్రాటాబ్ టాబ్లెట్లు, 30 అల్ట్రా కింగ్ టాబ్లెట్లు, 5 ట్రామజాక్ ఇంజెక్షన్లు, ఒక లిగ్నాక్స్ ఇంజెక్షన్, మూడు సిరంజిలు ఉన్నాయి.

విచారణలో మెడికల్ షాప్ యజమాని షెడ్యూల్-హెచ్, షెడ్యూల్-హెచ్1 కేటగిరీకి చెందిన మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు పదార్థాలకు బానిసైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో టాబ్లెట్‌ను రూ.100కు, ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.500కు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

పట్టుబడిన వినియోగదారులు శ్రీ బాలాజీ మెడికల్ షాప్ నుంచి ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రామడాల్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారు టాబ్లెట్లను నీటిలో కరిగించి ఇన్సులిన్ సిరంజిల ద్వారా నేరుగా శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకునేవారని విచారణలో తేలింది.

ఈ కేసుకు సంబంధించిన నిందితులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి దర్యాప్తు నిమిత్తం సురారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మత్తు మందుల అక్రమ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!