e-Paper
Monday, November 2, 2026
Homeజాతియంబ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం

బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం

📰 Generate e-Paper Clip

  • ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
  • ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఏర్పాట్లు

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న 2వ బ్రిక్స్ యాంటీ-కరప్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.

ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలైన 11 దేశాల నుంచి సుమారు 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానుండగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరో 40 మంది సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సంయుక్త కార్యదర్శి సుశీల్ కుమార్ పటేల్ సమావేశంపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అత్యవసర ఆరోగ్య సదుపాయాలు, రవాణా, ప్రోటోకాల్, వసతి, సమావేశ వేదిక నిర్వహణ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని వివరించారు.

సమీక్ష సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, అన్ని శాఖలు ముందస్తుగా సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతినిధుల భద్రతకు పటిష్ట చర్యలు, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణం, తగిన వైద్య సదుపాయాలు, నిరంతర పౌర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.అంతర్జాతీయ సదస్సులు, శిఖరాగ్ర సమావేశాల నిర్వహణలో హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, బ్రిక్స్ సమావేశం ద్వారా ఆ ప్రతిష్ఠ మరింత పెరిగేలా అన్ని శాఖలు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ప్రతినిధుల భద్రత, సౌకర్యాలు, సౌలభ్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సంజయ్ జాజు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో వైఎటీ అండ్ సీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, జీఏడీ (పోల్స్) ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!