తెలంగాణ వివిధ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిలిచిందని, పారిశ్రామికవేత్తలు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత (CII Northern Region) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్-500 కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉండగా, దానిని 10 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు.పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకు ఒకసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సూచించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు జోన్ల అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల సర్వీస్ సెక్టార్, ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య తయారీ పరిశ్రమలు, ఆర్ఆర్ఆర్ వెలుపల వ్యవసాయం, అగ్రి ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మాణం చేపడతామని వెల్లడించారు.వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని, శంషాబాద్–చెన్నై, శంషాబాద్–పూణె, శంషాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ మార్గాలు తెలంగాణకు రానున్నాయని సీఎం పేర్కొన్నారు.కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఉద్యోగ విపణిలో మార్పులు వస్తున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశంలోనే ఉత్తమ స్కిల్ యూనివర్సిటీగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మార్చి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నామని వివరించారు.హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCCs) ఏర్పాటుకు 200కు పైగా కంపెనీలు ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్లపై లక్ష కోట్ల రూపాయలు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం తెలిపారు.ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సీఐఐ నార్తర్న్ రీజియన్ చైర్మన్ పునీత్ కౌరా, డిప్యూటీ చైర్మన్ శ్రద్ధా సూరి మార్వా తదితరులు పాల్గొన్నారు.సీఐఐ స్పందన:సీఐఐ నార్తర్న్ రీజియన్ చైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ, తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు దేశవ్యాప్తంగా పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం కారణంగానే హైదరాబాద్‌ను సమావేశ వేదికగా ఎంచుకున్నామని, రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలను అధ్యయనం చేసేందుకు వచ్చామని తెలిపారు.
