ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి అత్యంత కీలకమైన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు అమలుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలు పూర్తయినప్పటికీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) నుంచి నిధుల విడుదల ఎందుకు జరగలేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ తదితర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం మాట్లాడారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు మెట్రో విస్తరణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మంజూరు చేస్తే కేంద్ర వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు రూ.13,500 కోట్ల రుణం కోసం ఐఆర్ఎఫ్‌సీతో అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారెంటీ కూడా సమర్పించామని తెలిపారు. జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ నుంచి నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో జమ అయినప్పటికీ, ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేయలేదని అన్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభం నుంచి జరిగిన పరిణామాలను ప్రస్తావించిన సీఎం, 2009లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.15 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఫలక్‌నుమా మార్గం ఇప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు.
గత పదేళ్లలో మెట్రో విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించిన ఆయన, ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయిందన్నారు. నగర జనాభా 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో మెట్రో విస్తరణ తప్పనిసరి అవసరంగా మారిందని చెప్పారు.
మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఎల్ అండ్ టీతో చర్చలు జరిపామని, అయితే ప్రతి ఏడాది రూ.350 నుంచి రూ.400 కోట్ల నష్టాలు వస్తున్నందున విస్తరణ సాధ్యం కాదని సంస్థ స్పష్టం చేసిందన్నారు. దీంతో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని విస్తరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో ఆ దిశగా అన్ని చర్యలు పూర్తి చేశామని వెల్లడించారు.
రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను సుమారు రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందని, గత ప్రభుత్వాలు 8 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నప్పటికీ, ఈ ప్రాజెక్టు కోసం కేవలం 4 శాతం వడ్డీతో ఐఆర్ఎఫ్‌సీ నుంచి రుణం పొందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఐఆర్ఎఫ్‌సీకి ఫీజుల రూపంలో రూ.84 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా రూ.1,400 కోట్లు ఇప్పటికే చెల్లించామని పేర్కొన్న సీఎం, అన్ని లావాదేవీలు పూర్తయిన తర్వాత కూడా నిధుల విడుదల ఆగిపోవడానికి కారణమేంటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం నిధులు అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రాజెక్టును అమలు చేయాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
