e-Paper
Sunday, September 13, 2026
Homeఇంటర్నేషనల్స్లోవేకియా పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం

స్లోవేకియా పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం

📰 Generate e-Paper Clip

భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానం – మౌలిక వసతులు, రక్షణ, ఏఐ రంగాల్లో అపార అవకాశాలు

ఆదాబ్ సైబరాబాద్, బ్రాటిస్లావా, జూన్ 15: భారత ప్రధాని నరేంద్ర మోదీ స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో కలిసి స్లోవేకియాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రైల్వేలు, రక్షణ, ఆటోమొబైల్, ఇంధనం, సమాచార సాంకేతికత, ఆరోగ్య రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్-స్లోవేకియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత్‌లో వ్యాపార సౌలభ్యం పెంపు, పారదర్శకత, స్థిరమైన ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చేపట్టిన సంస్కరణలను ఆయన వివరించారు.

భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆరోగ్య రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ స్లోవేకియా కంపెనీలను పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

స్లోవేకియా పారిశ్రామికవేత్తలు ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా భారత్ చేపడుతున్న సంస్కరణలను స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెంచడం, సాంకేతిక భాగస్వామ్యాలు, భారతీయ సంస్థలతో సంయుక్త వ్యాపారాలు ఏర్పాటు చేయడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.

ఇటీవల భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పూర్తికావడాన్ని స్వాగతించిన పారిశ్రామికవేత్తలు, అది అమల్లోకి వస్తే తమకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో టాట్రావాగోంకా, ఈసెట్, గ్రాండ్ పవర్, పెంటా హాస్పిటల్స్ ఇంటర్నేషనల్, మాటడోర్, వియుజే, విపో, మైక్రోస్టెప్-ఎంఐఎస్, వీఆర్‌ఎం, ఈకో ఇన్వెస్ట్‌మెంట్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్-స్లోవేకియా ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఇరు దేశాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!