ఆన్‌లైన్ గేమింగ్ కోసం డబ్బులు మళ్లింపు.. మొత్తం నగదు స్వాధీనం
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కోసం ఓ వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు అక్రమంగా బదిలీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నరేందర్ (37)ను అదుపులోకి తీసుకుని, మోసపూరితంగా కాజేసిన మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, 66 ఏళ్ల వృద్ధురాలి కుటుంబ సభ్యులతో స్నేహం పెంచుకున్న నరేందర్, వారి నమ్మకాన్ని సంపాదించాడు. డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన తక్కువగా ఉన్న వృద్ధురాలి మొబైల్ ఫోన్‌లో రహస్యంగా బ్యాంకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఆమెకు తెలియకుండా యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.5 లక్షలను వివిధ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది.
ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు డీసీపీ సైబర్ క్రైమ్స్ టి. సాయి మనోహర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. మొబైల్ లొకేషన్ ట్రాకింగ్, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) విశ్లేషణ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. మోసపూరితంగా బదిలీ చేసిన రూ.5 లక్షల నగదును పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్‌లను ఇతరులతో ఇన్‌స్టాల్ చేయించుకోవద్దని, పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలను తరచుగా పరిశీలించాలని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
