- ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి మంత్రి కొండా సురేఖనూతన
- ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో భేటీ
- శాఖల ప్రాధాన్య అంశాలపై చర్చ
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను పర్యావరణ, అటవీ శాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శైలజా రామయ్యర్ నేతృత్వంలో అటవీ, పర్యావరణ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం, వన్యప్రాణులు, జీవవైవిధ్య సంరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అడవుల రక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. అటవీ, పర్యావరణ శాఖలను మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.
