e-Paper
Wednesday, September 16, 2026
Homeతెలంగాణహనుమకొండరూ.13 కోట్ల బీటీ రహదారికి శంకుస్థాపన

రూ.13 కోట్ల బీటీ రహదారికి శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

  • ఎల్కతుర్తి అభివృద్ధిలో ముందంజ..
  • గ్రామాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని వెల్లడి

ఆదాబ్ సైబరాబాద్, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లి–ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కుడా వైస్ చైర్‌పర్సన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామాలకు మండల కేంద్రంతో రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఈ రహదారి నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరిగి ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా సీపీవో అజిత్ రెడ్డిలను శాలువాలతో సన్మానించారు. అలాగే ఎల్కతుర్తి–దామెర ప్రధాన రహదారిని అధికారులతో కలిసి పరిశీలించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అదే కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!