
నిర్మల్: ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు దేశానికి ఆదర్శప్రాయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో పర్యటించిన ఆయన, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు కవిత–సోము, తొడసం సుదర్శన్–మధుబాయి, సీతాబాయి–దేవురావు కుటుంబాలకు చెందిన కొత్త ఇళ్లను మంత్రి సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం కావడం ఆనందకర విషయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, రిమ్మ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇప్పటి వరకు 69 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన కుటుంబాలకు అదనపు ఇళ్ల మంజూరు కోసం చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామానికి అవసరమైన బీటీ రహదారి నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
గ్రామంలో గ్రంథాలయ నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావులేదని స్పష్టం చేశారు.

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రిమ్మ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని తెలిపారు.
రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రజలందరూ సమష్టిగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, సర్పంచ్ పెందుర్ జంగుబాయి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
