ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పోలీసు అధికారులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
సమావేశంలో వివిధ విభాగాలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను ఎస్పీ సమీక్షించారు. దర్యాప్తులో జరుగుతున్న జాప్యాలపై అధికారులను ప్రశ్నిస్తూ, బాధితులకు సకాలంలో న్యాయం అందించడం పోలీసు వ్యవస్థ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కేసును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పాత కేసుల ఛేదనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఎస్పీ, జిల్లాలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు “నిఘా నేత్ర” కార్యక్రమం కింద కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పనిచేయని కెమెరాల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. అలాగే ప్రతి సీసీటీవీ కెమెరాను జియో-ట్యాగింగ్ చేయడం ద్వారా నేరస్థలాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.
ప్రతి పోలీసు స్టేషన్‌లో 7 ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, స్టేషన్‌కు సంబంధించిన ప్రతి అంశంపై ఎస్‌హెచ్‌ఓలకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. పోలీసు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“రక్షణ నేత్రం”, “సురక్షా మిత్ర” వంటి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వారిని కూడా భాగస్వాములను చేయాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హెడ్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
సమావేశంలో జిల్లా అదనపు డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
