ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : రూ.1.46 కోట్ల మ్యాట్రిమోనీ-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ మోసం కేసును ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితుల నుంచి మోసపూరితంగా వసూలు చేసిన నగదును మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా తరలించి, హవాలా మార్గంలో సింగపూర్‌కు చెందిన సైబర్ మోసగాళ్లకు చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అరెస్టు చేసిన నిందితులు సిద్ధిపేటకు చెందిన చొక్కాల సంపత్, సికింద్రాబాద్‌కు చెందిన హెచ్చు నరేష్, ఎండ్ల సురేష్, వడ్కల మహేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు వివరాల ప్రకారం, ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో మహిళగా పరిచయమైన సైబర్ మోసగాడు వివాహం పేరుతో బాధితుడి నమ్మకాన్ని సంపాదించాడు. అనంతరం అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ ఆన్‌లైన్ పెట్టుబడి వేదికలో పెట్టుబడులు పెట్టించాడు. మోసగాళ్లు చూపించిన నకిలీ లాభాలను నమ్మిన బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.46.65 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా మరిన్ని చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేసి, చివరకు అతనితో సంబంధాలు పూర్తిగా నిలిపివేశారు.
ఈ ఘటనపై క్రైమ్ నెం.227/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిధుల లావాదేవీలను విశ్లేషించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
దర్యాప్తులో నిందితులు ప్రధాన సూత్రధారుల ఆదేశాల మేరకు మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, మోసపూరిత నగదును ఉపసంహరించి తరలించడం వంటి కార్యకలాపాలకు సహకరించినట్లు తేలింది. ఇందుకు ప్రతిఫలంగా 10 నుంచి 30 శాతం వరకు కమిషన్ పొందినట్లు పోలీసులు వెల్లడించారు. మోసపూరిత నగదు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మీదుగా ప్రయాణించి, ముఖ్యంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాల ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు చేరినట్లు గుర్తించారు.
ఏసీపీ సైబర్ క్రైమ్ మార్గదర్శకత్వంలో, ఇన్‌స్పెక్టర్ కె.ఎం. రాఘవేంద్ర పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పోలీసుల బృందం ఈ కేసును విజయవంతంగా ఛేదించింది.
ప్రజలకు పోలీసుల సూచనలు:
మ్యాట్రిమోనీ, సోషల్ మీడియా లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పరిచయమైన అపరిచితులు వివాహం లేదా అధిక లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో చేసే ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు. ధృవీకరణ లేని వెబ్‌సైట్లు లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడులు పెట్టకుండా, డబ్బు బదిలీ చేసే ముందు వాటి విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
